Jagathguru Bhodalu Vol-6        Chapters        Last Page

ఓమ్‌
శ్రీ జగద్గురుభ్యో నమః
జగద్గురు బోధలు
అంబికా కటాక్షం

దృశా ద్రాఘీయస్యా దరదళిత నీలోత్పలరుచా

దవియాంసం దీనం స్నపయ కృపయా మామపి శివే

అనేనాయం ధన్యో భవతి న చ తే హాని రియతా

పనే వా హర్మ్యే వా సమకరనిపాతో హిమకరః.
- సౌందర్యలహరి.

భగవత్పాదులవారు అమ్మవారిని స్తుతిస్తూ - తల్లీ ! ఎచ్చటనో దవుదవ్వుల కడుదీనతతో నిలిచియున్న నన్ను అరవిడిచిన నీలోత్పలమువంటిదై సుదీర్ఘమైన నీ కడగంటి చూపుతో - స్నపయ కృపయా - దయతో స్నానము చేయించుము'- అని వేడుకొంటున్నారు.

2)

జగదీశ్వరీ సమక్షంలో చాలా ఎడముగా దూరంగా దీనంగా ఆయన నిలచి ఉన్నారట. దూరమైతే మాత్రము హాని యేముంది? ఆమె చూపులు ఎంత దూరమైన చూడగలవు. తుషారసిక్తములైన నీలోత్పలములవలె ఆమె చూపులు చల్లగా తాపశమనంగా ఉన్నాయి. తనవంక చూస్తే ఆమె సోమ్మేమిపోతుంది? 'వనేవా హర్మ్యేవా సమకరనిపాతో హిమకరః' - ఇది అడవి, ఇది మేడ అన్న భేదం లేకుండా చంద్రుడు తన కిరణాలతో వెన్నెలలు కురియిస్తాడు. అట్లే ఈ విశాలవిశ్వంలో ఏమూల ఉన్నా ఆ విశ్వేశ్వరి, విశాలాక్షి తన కృపారసాన్ని చిలకరించి మన జీవితాలను సుధాపరి ప్లుతములుగా చేస్తుంది. అన్నదే ఆచార్యుల వారి బోధ.

జగన్మాత ఈశ్వరుని అర్థాంగి. ఆచార్యులు శివాంశ##మే కాదు, శివావతారమే, అందుచే ఆయన పరదేవతకు ప్రతీకమే. కాని మనవంటి వారి హృదయాలలో భక్తిబీజాలు నాటు కొనాలని, మనకు మార్గదర్శకంగా తన్ను తాను చాలా కించపరచుకొని - 'దీనం దవీయాంసం- దీనుడను దూరము నందున్నాను' అని చెప్పుకొని - 'మామపి- నన్ను కూడా' అని మరింత లాఘవపరుచుకొని- 'స్నపయ కృపయా' - అని ప్రార్థిస్తున్నారు. 'మామపి' అని అనటంలో - 'నన్ను మించిన వారు, సచ్ఛీలురు, సత్పాత్రులు, నీ అనుగ్రహ భాగ్యమునకు నోచుకొన్నవారు ఉండవచ్చును.' అని వినయాన్ని సూచించే మరియొక అర్ధంకూడా ఉన్నది. ఆచార్యులు వినయస్వరూపులు 'సువినయో యస్య స్వభావాయతే!'

''హేశివే ; ద్రాఘీయస్యా దరదళిత నీలోత్పలరుచా దృశా, దవీయాంసం దీనం మామపి కృపయా స్నపయా !''

మహోదార్యంతో ఆచార్యులవారు మనకిచ్చిన పెన్నిధి 'సౌందర్యలహరి' ఆ పెన్నిధిలోని రత్నములను కంఠస్థం చేసి భక్తిని పెంపోందించు కొనుటయే మనము వారికి చూపగల కృతజ్ఞత.


Jagathguru Bhodalu Vol-6        Chapters        Last Page